Friday, 30 October 2020

ఘర్షణ కలుగుటలో తేడాలు

ఘర్షణ కలుగుటలో తేడాలు 


గరుకు తలము లిచ్చు  ఘన ఘర్షణ బలము
తలికె తలము వలన తక్కువగను
మానవాళికి యిది మరి కీడు మేలును
సత్య మింతె గాద సరిగ రమణ

 

భావం: రమణా! గరుకు తలాలు ఎక్కువ ఘర్షణను కలిగిస్తాయి. నున్నని తలాలు తక్కువ ఘర్షణను కలిగిస్తాయి. ఘర్షణ మానవులకు మంచిని, చెడుని కూడా కలిగిస్తుంది. సత్యం సరిగ్గా ఇంతే కదా.

కఠిన పదం: తలికె = నున్నని 

Sunday, 25 October 2020

ఘర్షణ

ఘర్షణ


కలదుగ తలముల నడుమను
గలదుగ చలనముల నాప ఘర్షణ బలమున్
గలదుగ తలముల స్పర్శను
గలుగును రాపిడి వలనను ఘర్షణ  రమణా 
భావం: రమణా! ఘర్షణ  తలముల మధ్య ఉంటుంది. అది చలనమును (కదలికని) ఆపుతుంది. తలములు స్పర్శలో ఉంటే రాపిడి వలన ఘర్షణ కలుగుతుంది.


ఘర్షణ ఎక్కడ ఉందో గుర్తించండి  







Thursday, 22 October 2020

బలం ఏమి చేస్తుంది?

 బలము వలన వచ్చు మార్పులు

బల మేమి చేయుననగను
చలనమును మరియు దిశలను చక్కగ మార్చును
బలమిక యాకారములో
కలిగించును మార్పులచట కదరా రమణా 
భావం: రమణా! బలం ఏమి చేయగలదు అంటే, బలము వస్తువు చలన స్థితిని, దిశను మరియు ఆకారములను మార్చుతుంది.


బలము వస్తు చలన స్థితిని మార్చుట



బలము దిశను మార్చుట




బలము వస్తు ఆకారాన్ని మార్చుట

Wednesday, 21 October 2020

పీడనం



పీడనము


బలమది యెంత గలిగినను
తల వైశాల్యము గణించ వలె తప్పకుండ
బల తల వైశాల్యములకు
గల నిష్పత్తియెగ పీడన మనగ రమణా
భావం: రమణా! బలం ఎంత ఉన్నప్పటికీ, తల వైశాల్యమును కూడా పరిగణన లోకి తీసుకోవాలి. బలానికి, తల వైశాల్యానికి గల నిష్పత్తిని "పీడనం" అంటారు.

 

బల పరిమాణము పెరిగిన
కలిగిన పీడనము హెచ్చు కనుగొన దలచిన
బల పరిమాణము తగ్గిన
కలిగిన పీడనము కొలది గదరా రమణా
భావం: రమణా! బలము యొక్క పరిమాణం పెరిగితే పీడనం కూడా పెరుగుతుంది. బలము యొక్క పరిమాణం తగ్గితే పీడనం కూడా తగ్గుతుంది.
( అనగా పీడనం, బలమునకు అనులోమానుపాతంలో ఉంటుంది.)
(కొలది = తక్కువ)


తల వైశాల్యము పెరిగిన
కలిగిన పీడనము కొలది కనుగొన దలచిన
తల వైశాల్యము తగ్గిన
కలిగిన పీడనము హెచ్చు గదరా రమణా
భావం: రమణా! తలము యొక్క వైశాల్యం పెరిగితే పీడనం తగ్గుతుంది. తలము యొక్క పరిమాణం తగ్గితే పీడనం పెరుగుతుంది.
( అనగా పీడనం, స్పర్శాతల వైశాల్యమునకు విలోమానుపాతంలో ఉంటుంది.)
                         పీడనం = బలము / స్పర్శాతల వైశాల్యము

 



 

 


Tuesday, 20 October 2020

ఫలిత బలము

ఫలితబలము

 

బలము లనేకములున్నను
బలదిశల వలనను ఫలిత  బలము గలునుగా
బల దిశల పరిగణించిన
బలముల బీజీయ సంకలనమెగ రమణా
భావం: రమణా! పని చేస్తున్న బలములు ఎన్ని ఉన్నా, బలముల దిశలను బట్టి ఫలిత బలము కలుగుతుంది. కనుక బల దిశలను పరిగణనలోకి తీసుకొని బలముల బీజీయ మొత్తమే ఫలిత బలము అవుతుంది. 


 

ఫలిత బలాన్ని ఎలా లెక్కించాలి అంటే....
 
ఏక దిశల బలము లేకమై పోవును
ఎదురు దిశల బలము లేమి చేతు
తీసి వేయ దగును తీరైన రీతిని
ఫలిత బలము వీని ఫలము రమణ.   
 
భావం: రమణా! ఒకే దిశలో పనిచేసే బలాలు కలిసిపోతాయి. (అనగా ఒకే దిశలో పనిచేసే బలాలను కలపాలి). వ్యతిరేక దిశలలో పనిచేసే బలాలను ఏమి చేయాలంటే తగు విధంగా ( పెద్ద విలువ నుంచి చిన్న విలువను) తీసివేయాలి. ఆ విధమగా వచ్చిన ఫలితమే "ఫలిత బలము" అవుతుంది.

ఫలిత బలాన్ని లెక్కించండి



  

 

 

Monday, 19 October 2020

క్షేత్ర బలములు

 

క్షేత్ర బలములు

కనుగొన మూడు బలములవి
అనువున విద్యుత్ బలము నయస్కాంత బలము
వినుమిక గురుత్వ బలమును
అనరా యివి క్షేత్ర బలము యెంచగ రమణా
భావం: రమణా! చూడగా మూడు బలము లున్నవి. అవి విద్యుత్ బలము, అయస్కాంత బలము మరియు గురుత్వాకర్షణ బలము. వీటిని క్షేత్ర బలములు అంటారు.



విద్యుత్ బలము
బెలూన్ ను ఉన్ని గుడ్డతో రుద్దిన అది తలను ఆకర్షించుట

అయస్కాంత బలం
(అయస్కాంతం ఇనుముని ఆకర్షించుట)

గురుత్వాకర్షణ బలం
(కాయలను భూమి ఆకర్షించుట)
 

తన్యతా బలము

తన్యతా బలము 

బలము గలదు లాగుటలో
బల దిశ ఏదైన గాని లాగెడి వైపున్ 
కలిగిన బలమే తన్యత
బలమందురు బుద్ధిమతులు భళిగా రమణా

భావం: రమణా! లాగుటలో బలము ఉన్నది. ఆ బలదిశ ఎలా ఉన్నా, లాగుతున్న వైపు పనిచేసే బలాన్ని తన్యత బలము అని అంటారు.

తన్యతా బలము బలము యొక్క దిశలను గుర్తించండి.

 









అభిలంబ బలము

 

అభిలంబ బలము

తలములపై గల వాటిని 
తల మెప్పుడు పైకి తోయు తప్పని సరిగా
బలమది యభిలంబ బలము
బలదిశ తల లంబదిశయె భళిగా  రమణా
 

భావం: రమణా! తలములు తనపై నున్న వస్తువులను పైకి తోస్తాయి. ఈ పనిచేసే బలమే అభిలంబ బలము. దీని బల దిశ ఎల్లపుడూ లంబంగా ఉంటుంది.


  అభిలంబ బల దిశను గుర్తించండి.


















             
                 
                   అభిలంబ బల దిశను గీయండి









స్పర్శాబలములలో రకములు

 

స్పర్శాబలములలో రకములు


కండరాల బలము యభిలంబ బలమును
తన్యతయును ఘర్షణా  బలములు,
స్పర్శ బలములు గద సరిగాను చూడగా
సత్య మింతె గాద సరిగ రమణ

భావం: రమణా! సరిగా చూస్తే  కండరాల బలము, అబిలంబ బలము, తన్యతా బలము మరియు ఘర్షణ బలములు అనేవి స్పర్శా బలములని తెలుస్తుంది. సత్యం సరిగా ఇంతే కదా.

 

 

స్పర్శాబలములు



స్పర్శాబలం - క్షేత్రబలం

 

స్పర్శాబలం - క్షేత్ర బలము


తాకగనే పని చేయును

తాకనిచో చేయదు పని తప్పని సరిగా

తాకిన పని చేయు బలము

యేకంగా స్పర్శబలము యెఱుగుము రమణా

భావం: రమణా! తాకినపుడు (స్పర్శలో ఉన్నపుడు) పని చేసి, తాకనపుడు పనిచేయని బలాము "స్పర్శాబలం" అని తెలుసుకో.

తాకకనే పని చేయును
తాకకనే చేయును పని తన క్షేత్రములో
తాకక పని చేయు బలము
యేకంగా క్షేత్ర బలము యెఱుగుము రమణా


భావం: రమణా! తాకకుండా (స్పర్శలో లేనపుడు) మరియు తన క్షేత్రములో ఉన్నపుడు మాత్రమే పనిచేసే బలమున "క్షేత్ర బలము" అని తెలుసుకో.



స్పర్శా బలము, క్షేత్ర బలములను గుర్తించండి




 






నెట్టుట - లాగుట

 

నెట్టుట - లాగుట 


కలవందురు యన్ని పనుల
బల రూపములనగ రెండు బాగుగ తెలపన్
గలవియె నెట్టుట లాగుట
గల వొంటిగ జంటగాను కనుగొన రమణా

భావం: రమణా! అన్ని పనులలో ఉన్నాయని అంటారు. అలా ఉన్న బల రూపాలు రెండే. అవి నెట్టుట మరియు లాగుట. పరిశీలించగా పనులలో వీటిని ఒక్కొకటిగా కానీ, జంటగా కానీ ఉపయోగిస్తారు అని తెలుస్తుంది.

 

https://readershook.com/ajax/download/doc/activity/Y25kemFHVmxkREV3TkRFd01EQXc=.pdf?fn=Push_or_Pull_force

                                                          సేకరణ: readershook.com

Sunday, 18 October 2020

బలము

 

బలం

బలమన్నది యేమనుచూ

పలు విధముల చేయు పనుల పరిశీలింపన్

బలమనగా లాగుటయును

వెలుపలకును తోయుటె గద వినరా రమణా

భావం: ఓ రమణా విను, బలం అంటే ఏమిటంటూ అనేక రకాలుగా చేయు పనులను పరిశీలిస్తే, బలం అంటే లాగుట మరియు తోయుట (నెట్టుట) యే గదా! నెట్టుట లగుటలానే బలం అంటారని భావం.  

 

                                                                         సేకరణ: https://studiok40.com

సేకరణ: https://pixy.org/




                                                                                                                       సేకరణ: https://creazilla-store.

 

Friday, 16 October 2020

ముందుమాట


              దేశ భాషలందు తెలుగు లెస్స

             శ్రీకృష్ణదేవరాయల వంటి వారిచే కీర్తింపబడి, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పాశ్చాత్యులచే కొనియాడబడిన తేనెలూరు తెలుగు నేడు ఆంగ్ల భాషా సంస్కృతి మోజులో నిరాదరణకు గురి అవుతున్నది. అందునా చెప్పదలచుకున్న భావన లేక భావాన్ని సూటిగా, క్లుప్తంగా, హృద్యంగా,  మనసుకు హత్తుకొనేటట్లు చెప్పగల పద్యాలు మరింత వెనుక బడ్డాయి. 

                 భాష భావ ప్రసార సాధనమేనని కాక భాషే ప్రధానమనే ఈ రోజుల్లో విజ్ఞాన భావనలను పంచుకోవడానికీ, ముందు తరాలకు అందిచుటకు మాత్రమే భాష ప్రయోజనమనీ, భావనలు మాతృభాషలోనే సులభ గ్రాహ్యమనీ (మనోవిజ్ఞాన పరిశోధనలు రుజువు చేసినప్పటికీ) కేవలం ఆంగ్లమే జీవితాన్ని తీర్చి దిద్దగలదనే మూఢనమ్మకంతో పిల్లలపై రుద్దబడుతున్న బలవంత మాధ్యమ విధానం వారిలోని సృజనాత్మకతను నశింప చేస్తోందని ఎంత మంది గ్రహిస్తున్నారు.

         నీతి మాత్రమే పద్యాల రూపంలో చెప్పబడుతున్నదని, అవి భాషా ప్రక్రియలో అప్రధానమని, నేడు భోధనలో వాటి ప్రాధాన్యతను తగ్గించారని తోస్తోంది. పాట ఎంత అందంగా భావాన్ని చెప్పగలదో, అంతే అందంగా పద్యం కూడా భావాన్ని చెప్పగలదు. పాట ఎంతగా అలరిస్తుందో, లయ బద్ధంగా చదివినపుడు పద్యం కూడా అంతే ఆనందాన్ని ఇస్తుంది. విజ్ఞాన భావనలను పద్య రూపంలో చెప్పగలిగినపుడు ఆ భావన ఎక్కువ కాలం స్ఫురణలో ఉంటుందని నా అనుభవం. అందునా తేటగీతి, ఆటవెలది, కంద పద్యాలు వ్రాయుటకునూ చదువుటకునూ సులభమనీ నేను భావించి, ఓ చిరు ప్రయత్నంగా ఎనిమిదవ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలోని కొన్ని ముఖ్య భావనలను పద్య రూపంలో అందించ సంకల్పించాను. వీలుని బట్టి ఇతర తరగతుల, ఇతర బోధనా విషయాల భావనలను కూడా అందించుటకు ప్రయత్నిస్తాను.

       👉విన్నపం: నాకు ఛందస్సు మీద పట్టు తక్కువ. కానీ "చంధం" అనే సాంకేతిక సాధనం సహాయంతో ఈ ప్రయత్నం చేస్తున్నాను. భాషా వేత్తలు ఇందలి ఛందో దోషాలను గమనించి, తెలిపినచో తగు విధంగా సవరించ గలననీ, కొన్ని పద్యాల యందు సాంకేతిక పదాలను ఆంగ్ల ఉచ్ఛారణ లోనే తెలుగున వాడడం జరిగిందనీ సవినయంగా మనవి చేస్తున్నాను. తగురీతిని నన్ను నడిపించగలందులకు అందరినీ అభ్యర్ధిస్తూ.....

                                                                                  - నిర్వాహకుడు.

పద్య సౌరభం

పద్య మెల్ల జనుల పఠన శక్తిని బెంచు

హృద్యమై చదువరి హృదయమందు

హత్తుకొని విషయ మహత్తుల జూపురా

సత్య మింతె గాద సరిగ రమణ

 

వసుధ భాష లందు వాసికెక్కిన యన్ని

భాష లందు లేని భాగ్య మొకటి

తెలుగు నందు రాయు తేట పద్యాలయా

తెలుగు వెలుగు జెప్ప తరమె రమణ


పద్య రాజములను పలు రీతులున్నను

ఆట వెలది పద్యమంత సుళువు

లేదు లేదనుచును లిఖియింప దలచి నే

నెంచినాననునది నిజము  రమణ

స్థుతి

 



ఇలవేల్పుగ వెంట నిలచి
ఇలలో నే జేసిన పనులన్నిట తోడుగ
నిలచినది సత్యదేవుడె
కలలో యిలలో నెపుడును గాచెను రమణా

తెలిసీ తెలియని వయసున
కలత పడిన మనసుతోడ ఇల తన సన్నిధి
నిలువగనె వేంకటేశుడు
చలచల్లగ దారిజెప్పె కరుణతొ రమణా

యిమ్ముగ రాముని దలచిన
గమ్మున వెంటగ నిలబడి కరుణతొ నెపుడూ
నమ్మిన వానిని యెన్నడు
దమ్ముగ యాపదల గాచుగదరా రమణా


రామాయని ప్రార్ధింపగ
యేమాయని వాయుపుత్రు డేతెంచినాడు
రాముని దూతగ నాకిల
నోముల పంటగ హనుమను కొలిచెద రమణా

 


 

 

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు

తొలుత నిను దలచిన తోవ జూపెదవుగా

విఘ్నములను బాపి విద్య నేర్పు

విఘ్న నాయకుడగు విఘ్నేశ్వరా నీకు

వందనాలు యివియె వందవేలు.

 

ఘర్షణ కలుగుటలో తేడాలు

ఘర్షణ కలుగుటలో తేడాలు  గరుకు తలము లిచ్చు  ఘన ఘర్షణ బలము తలికె తలము వలన తక్కువగను మానవాళికి యిది మరి కీడు మేలును సత్య మింతె గాద సరిగ రమణ   భా...